యెహోవా సమాధానమిచ్చాడు: “ఇతర జనులవైపు చూడు! వారిని గమనించు. నీకు విస్మయం కలుగుతుంది. నీ జీవిత కాలంలో నీకు విస్మయం కలిగించే ఒక పని చేస్తాను. నీవు అది నమ్మాలంటే చూసి తీరాలి. దాని విషయం నీకు చెపితే అది నీవు నమ్మవు.
బబులోను ప్రజలను నేను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దుతాను. ఆ ప్రజలు నీచులు; శక్తిగల యుద్ధవీరులు. వారు భూమికి అడ్డంగా నడుస్తారు. వారికి చందని ఇండ్లను, నగరాలను వారు వశపర్చుకుంటారు.
వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగం కలవి. సూర్యుడు అస్తమించాక అవి తోడేళ్ళ కంటె నీచంగా ఉంటాయి. వారి గుర్రపు దళంవారు దూర ప్రాంతలనుండి వస్తారు. ఆకలిగొన్న గరుడ పక్షి ఆకాశం నుండి కిందికి దూసుకు వచ్చినట్లు, వారు తమ శత్రువులను వేగంగా ఎదుర్కొంటారు.
వారంతా చేయకోరుకునే ఒకే ఒక్క విషయం యుద్ధం. వారి సైన్యాలు ఎడారిలో గాలిలా వేగంగా నడుస్తాయి. మరియు బబులోను సైనికులు అనేకానేక మందిని చెరబడతారు. ఇసుక రెణువుల్లా లెక్కలేనంత మందిని పట్టుకుంటారు.
“బబులోను సైనికులు ఇతర దేశాల రాజులను చూసి నవ్వుతారు. పరదేశ పాలకులు వారికి హాస్యగాండ్రవలె ఉంటారు. పొడవైన, బలమైన గోడలు గల నగరాలను చూచి బబులోను సైనికులు నవ్వుతారు. ఆ సైనికులు గోడ మీదికంటె మట్టి బాట సునాయాసంగా నిర్మించి, నగరాలను తేలికగా జయిస్తారు.
పిమ్మట హబక్కూకు చెప్పాడు: “యెహోవా, నీవు ఎల్లకాలములయందు ఉండే దేవుడవు! నీవు చావులేని పవిత్ర దేవుడవు! యెహోవా, జరుగవలసిన కార్యం జరిపించటా నికే నీవు బబులోను ప్రజలను సృష్టించావు. మా ఆశ్రయ దుర్గమా, యూదా ప్రజలను శిక్షించటానికి నీవు వారిని సృష్టించావు.
నీ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు. ప్రజలు తప్పు చేయటాన్ని నీవు చూడలేవు. మరి అటువంటి నీవు ఆ దుష్టులు జయించటం ఎలా చూడగలు గుతున్నావు? దుష్టులు మంచివారిని ఓడించటం నీవెలా చూడగలుగుతున్నావు?
శత్రవు తను భాగ్యవంతుడుగా నివసించటానికి, మంచి ఆహారం తినటానికి అతని వల అతనికి సహాయపడుతుంది. కావున శత్రవు తన వలనే ఆరాధిస్తాడు. తన వల యొక్క గౌరవార్థం అతడు దానికి బలులు అర్పించి, ధూపంవేస్తాడు.